Forex Reserves | ముంబై, డిసెంబర్ 20: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. వరుసగా కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు గతవారంలోనూ 2 బిలియన్ డాలర్లకు తరిగిపోయాయి. దీంతో ఈ నెల 13తో ముగిసిన వారాంతానికిగాను విదేశీ మారకం నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 3.235 బిలియన్ డాలర్లు తగ్గిన విషయం తెలిసిందే.
డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.047 బిలియన్ డాలర్లు పతనమై 562.576 బిలియన్ డాలర్లకు తగ్గాయని పేర్కొంది. కానీ, పసిడి రిజర్వులు 1.121 బిలియన్ డాలర్లు ఎగబాకి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్‌లో 704.885 బిలియన్ డాలర్లకు చేరుకున్న రిజర్వులు గడిచిన నాలుగు నెలల్లో ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పైగా తగ్గాయి.