Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserves) 6.477 బిలియన్ డాలర్లు పతనమై 675.653 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు నవంబర్ ఒకటో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.675 బిలియన్ డాలర్లు పతనమై 682.13 బిలియన్ డాలర్లకు చేరాయి. కొన్ని వారాలు పతనమైన తర్వాత సెప్టెంబర్ నెలాఖరులో ఫారెక్స్ రిజర్వ్ నిల్వల కిట్టి జీవిత కాల గరిష్టం 704.885 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో ముఖ్యమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 4.467 బిలియన్ డాలర్లు క్షీణించి 585.383 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గోల్డ్ రిజర్వు నిల్వలు కూడా 1.936 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 67.814 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 60 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 18.159 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వు నిల్వలు 14 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 4.298 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.