న్యూఢిల్లీ, మే 24: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో నిధులను వెనక్కితీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుత వారంలోనూ రూ.5 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో ఈ నెల 19 నుంచి 23 మధ్యకాలంలో ఈక్విటీల నుంచి రూ.4,784.32 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.18,620 కోట్ల నుంచి రూ.13,835 కోట్లకు తగ్గాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
గత ఐదు సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు అత్యధికంగా తమ పెట్టుబడులను తరలించుకుపోయారు. తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు గతవారంలో ఒకేరోజు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి ఎఫ్ఐఐలు రూ.98,516 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..యూరోపియన్ దేశాలపై ప్రతీకార సుంకాలను 50 శాతం విధిస్తూ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొన్నది.
ఫలితంగా ఈక్విటీల నుంచి తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించారు. దేశీయ ఆర్థిక మూలలపై ఎలాంటి ప్రభావం లేదని, కేవలం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల వల్లనే ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకుంటున్నారని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నెలలో ఎఫ్ఐఐలు రూ.4,223 కోట్ల పెట్టుబడులు పెట్టగా, మార్చి నెలలో రూ.3,973 కోట్ల విలువైన స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. కానీ, జనవరి నెలలో రూ.78 వేల కోట్లు, ఫిబ్రవరి నెలలో రూ.34,574 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.