న్యూఢిల్లీ, జూలై 3: రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ఇన్వెస్టర్లు జంకుతున్నారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ రంగం జోలికి వెల్లడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీంతో ఏడాది ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 33 శాతం తగ్గి 1.69 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు కొల్లీర్స్ తాజా నివేదికలో వెల్లడించింది.
క్రితం ఏడాది ఇదే సమయంలో 2,533.30 మిలియన్ డాలర్లు(2.53 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టారు. కానీ, దేశీయ పెట్టుబడిదారులు అత్యధికంగా నిధులు చొప్పించారు. గడిచిన మూడు నెలల్లో 642.8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ రంగ వృద్ధిలో దేశీయ ఇన్వెస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, 2021లో మొత్తం పెట్టుబడుల్లో వీరి వాటా 16 శాతంగా ఉండగా, 2024 నాటికి రెండింతలు పెరిగి 34 శాతానికి చేరుకున్నట్టు కొల్లీర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగ్నిక్ తెలిపారు.