న్యూఢిల్లీ, మార్చి 15: దేశీయ ఈక్విటీ మార్కెట్లపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులో ఆందోళనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఈ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ పెట్టుబడులను తరలించుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.64 లక్షల కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, వాణిజ్య యుద్ధాలు మరింత తీవ్రతరం కావడం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోసారి అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్నట్లు వచ్చిన వార్తలతో ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించారు. దీనికి తోడు ఆటోమొబైల్, ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడం కూడా ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణమని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. బ్యాంకింగ్ రంగ సూచీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని, దీంతోపాటు రియల్టీ, ఆటో, మెటల్ సూచీలు కూడా పతనం చెందడం వారి ఆందోళనను తీవ్రతరం చేసింది.
ఆదుకున్న డీఐఐలు
ఒకవైపు ఎఫ్ఐఐలు భారీ స్థాయిలో నిధులను తరలించుకుపోతుంటే మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఈక్విటీల్లోకి రూ.1.77 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. కొత్తగా ఈక్విటీ మార్కెట్లోకి పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరగడం కూడా ఇందుకు పరోక్షంగా కారణమయ్యాయి.
తగ్గిన పసిడి రిజర్వులు
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు ఎట్టకేలకు పెరిగాయి. ఈ నెల7తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 15.26 బిలియన్ డాలర్లు ఎగబాకి 653.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత రెండేండ్లలో ఒకేవారంలో ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. అంతక్రితం వారంలో రిజర్వులు 1.781 బిలియన్ డాలర్లు కరిగిపోయి 638.698 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 13.993 బిలియన్ డాలర్లు ఎగబాకి 557.282 బిలియన్ డాలర్లకు చేరుకోగడం ఇందుకు కారణం. కానీ, బంగారం నిల్వలు మాత్రం కరిగిపోయాయి. గతవారంలో 1.053 బిలియన్ డాలర్లు తగ్గి 74.325 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.