Forex Reserves | ముంబై, మార్చి 9: విదేశీ మారకం నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నెల 1తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 6.55 బిలియన్ డాలర్లు పెరిగి 625.626 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 2.975 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 6 బిలియన్ డాలర్లు పెరిగి 554.231 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఫారెక్స్ రిజర్వులు పెరగడానికి దోహదం చేశాయని ఆర్బీఐ పేర్కొంది. అలాగే పసిడి రిజర్వులు 569 మిలియన్ డాలర్లు ఎగబాకి 48.417 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రిజర్వులు మా త్రం 17 మిలియన్ డాలర్లు తగ్గి 18.18 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అలాగే ఐఎంఎఫ్ వద్ద ఉన్న నిల్వలు కూడా 41 మిలియన్ డాలర్లు తరిగి 4.798 బిలియన్ డాలర్లకు తగ్గాయి.