న్యూఢిల్లీ, మే 30: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 44.42 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు మాత్రమే వచ్చాయి. 2022-23లో వచ్చిన 46.03 బిలియన్ డాలర్లతో పోలిస్తే 3.49 శాతం తగ్గాయి. సేవలు, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాల్లోకి వచ్చే ఎఫ్డీఐలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో ఎఫ్డీఐలు మాత్రం ఏడాది ప్రాతిపదికన 33.4 శాతం ఎగబాకి 12.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇది 9.28 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే ఈక్విటీలు, ఇతర క్యాపిటల్ రంగాల్లోకి వచ్చే ఎఫ్డీఐలు కూడా 71.35 బిలియన్ డాలర్ల నుంచి 70.95 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి.