హైదరాబాద్ మే 9 (నమస్తేతెలంగాణ) : గ్రాఫైట్, లిథియం, కాపర్ తదితర విలువైన ఖనిజాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన సంస్థ సంప్రదాయేతర ఇంధనవనరుల రంగంలోనూ సత్తా చాటాలని సూచించారు.
136 ఏండ్ల మైనింగ్ అనుభవాన్ని ఉపయోగించుకొని సంస్థ భవిష్యత్తుకు సుస్థిర ప్రణాళికలు రూపొందించుకోవాలని, విలువైన ఖనిజాల అన్వేషణకు ఉపక్రమించాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. రాజస్థాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు విద్యుత్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.