SEBI- Futures & Options | పెట్టుబడులకు ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ మార్గాలు. రిస్క్‌తో కూడుకున్న మార్గం ఈక్విటీ మార్కెట్లు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులపై లాభాలతోపాటు రిస్క్ కూడా ఎక్కువే. అందునా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తున్న మదుపర్లు భారీగా నష్టపోతున్నారని సెబీ అధ్యయనంలో తేలింది. అయినా పెట్టుబడి దారులు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ విభాగంలో ట్రేడింగ్ కే మొగ్గు చూపుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో మదుపు చేసిన వారిలో 91 శాతం మంది వ్యక్తిగత పెట్టుబడి దారులు.. అంటే దాదాపు 73 లక్షల మంది నష్టాల పాలయ్యారని సెబీ పేర్కొన్నది. ప్రతి పది మందిలో తొమ్మిది మంది ఇన్వెస్టర్లు సరాసరి రూ.1.2 లక్షల చొప్పున నష్టపోయారని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు రూ.75 వేల కోట్లు నష్టపోయారు. వారిలో దాదాపు నాలుగు లక్షల మంది ఇన్వెసటర్లు సరాసరి రూ.28 లక్షల చొప్పున నష్టపోయారని సెబీ వెల్లడించింది.
గత మూడు ఆర్థిక సంవత్సరాల గడువులో ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్’ విభాగం పెట్టుబడులు పెట్టిన వారిలో నష్టపోయిన వారు 93 శాతం పై మాటే. మూడేండ్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు నష్టపోయారని వివరించింది. అంటే దాదాపు కోటి మంది ట్రేడర్లు సరాసరి రూ.2 లక్షల దాక నష్టపోయారు. ఇక ఈ విభాగంలో లాభాలు గడించిన 7.2 శాతం మంది ఇన్వెస్టర్లలో ఒక్క శాతం మంది మాత్రమే రూ.లక్ష కంటే ఎక్కువ లబ్ధి పొందారు. 2021-22లో 51 లక్షల మందికి పరిమితమైన రిటైల్ ట్రేడర్లు.. గత ఆర్థిక సంవత్సరానికి 96 లక్షలకు చేరుకున్నది. గత ఆర్థిక సంవత్సరం స్టాక్ మార్కెట్ల మొత్తం టర్నోవర్ లో వీరి వాటా 30 శాతం అని సెబీ తెలిపింది. తక్కువ ఖర్చు, మోడర్న్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లు ‘ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్’ వైపు మళ్లుతున్నారని, దీనిపై వారికి అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొంది.