Reliance | గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ సహా ఐదు సంస్థల రూ.1.67 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 686.83 పాయింట్లు లేదా 1.09 శాతం నష్టపోయింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా నష్టపోయాయి. మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లాభాలతో ముగిశాయి.
మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.76,821.01 కోల్పోయి రూ.17,65,173.47 కోట్లతో సరిపెట్టుకున్నది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ. 53,641.69 కోట్ల నష్టంతో రూ.12,04,797.55 కోట్ల వద్ద స్థిర పడింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం రూ. 29,330.33 కోట్ల పతనంతో రూ.6,60,184.76 కోట్ల వద్ద ముగిసింది. టెలికం జెయింట్ భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,705.08 కోట్ల నష్టంతో రూ.4,64,529.84 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.104.62 కోట్ల పతనంతో రూ. 6,49,102.84 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24,882.17 కోట్ల లబ్ధితో రూ.6,39,370.77 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.13,493.73 కోట్లు వృద్ధి చెంది రూ.9,09,600.11 కోట్ల వద్ద నిలిచింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎం-క్యాప్ రూ.8,475.91 కోట్ల లబ్ధితో రూ.4,55,521.65 కోట్ల వద్ద ముగిసింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,942.90 కోట్లు లాభ పడి రూ.5,50,157.69 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.1,129.55 కోట్లు లాభ పడి రూ. 4,86,755.77 కోట్లకు చేరుకున్నది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్లో కొనసాగుతుండగా, తర్వాత స్థానంలో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ నిలిచాయి.