న్యూఢిల్లీ : భారత్‌లో ఇంధన ధరలు భగ్గుమంటున్న సమయంలో ప్రజలు ఇతర ఇంధనాల వైపు చూస్తుండటంతో ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. నెక్సాన్ ఈవీ, టైగర్ ఈవీ, ఎక్స్‌ప్రెస్-టీ ఈవీ వంటి వాహనాలతో ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్లో 70 శాతం వాటా కలిగిన టాటా మోటార్స్ తాజాగా దేశంలో తొలి టాటా సీఎన్జీ కారును వచ్చే నెలలో లాంఛ్ చేస్తోంది. భారత్‌లో నవంబర్‌లో తమ తొలి సీఎన్జీ పాసింజర్ వాహనం లాంఛ్ చేస్తామని టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో మారుతి సుజుకి, హ్యుండాయ్ సీఎన్జీ కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ సెగ్మెంట్లోకి టాటా మోటార్స్ ప్రవేశించడం మెరుగైన అవకాశంగా భావిస్తున్నారు. టాటా టియాగో లేదా టైగర్‌ను తొలి సీఎన్జీ కారుగా టాటా మోటార్స్ ముందుకుతెస్తుందని చెబుతున్నారు.
అల్టోజ్ సీఎన్జీ మోడల్‌పైనా టాటా కసరత్తు సాగిస్తోందని ప్రచారం సాగుతోంది. మరోవైపు భారత్‌లో టియాగో సీఎన్జీని టాటా మోటార్స్ లాంఛ్ చేసి పరీక్షిస్తుందని ఆపై కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. కొద్దినెలల కిందట భారత్‌లో టాటా టియాగో సీఎన్జీని టెస్ట్ చేశారని ఇది మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్జీ, హ్యండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్జీలకు దీటుగా ఉంటుందని భావిస్తున్నారు.