(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను మినహాయిస్తూ జీఎస్టీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోగా ఇది చారిత్రాత్మకమని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది. కానీ, తాజా నిర్ణయంతో బీమా పాలసీలు కొనే కోట్లాదిమందికి దక్కే ప్రయోజనం అంతంతేనని తెలుస్తున్నది.
బీమాపై జీఎస్టీని పూర్తిగా తొలగించినప్పటికీ పాలసీదారులకు ఆ స్థాయిలో ప్రయోజనం చేకూరబోదని పరిశ్రమ వర్గాలే చెప్తున్నాయి మరి. ఈ క్రమంలోనే బీమా బేస్ టారిఫ్ రేట్లు 3 నుంచి 5 శాతం పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్నది. లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఇప్పటివరకూ 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండేది. దీనిని ప్రస్తుతం పూర్తిగా మినహాయించారు. అంటే జీఎస్టీ సున్నా శాతానికి చేరిందన్నమాట.
ఈ నెల 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది. తాజా నిర్ణయంతో బీమా పాలసీలు చవగ్గా అందుబాటులోకి వస్తాయని.. మరింత మంది సామాన్యులు పాలసీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారని.. ఇది వారిపై ఆర్థిక భారం తగ్గిస్తుందని కేంద్రంలోని పెద్దలు చెప్తున్నారు. అయితే బీమాపై జీఎస్టీని జీరోకి చేర్చినంత మాత్రాన పూర్తిగా ఈ ప్రయోజనాలు పాలసీదారులకు అందుతాయని చెప్పలేమని బీమా, ఆర్థిక రంగా నిపుణులు చెప్తున్నారు. కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలు అందకపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
ఏమిటీ ఐటీసీ?
ప్రస్తుతం బీమా కంపెనీలు పాలసీలను అమ్మేటప్పుడే కొనుగోలుదారుల నుంచి 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. అలాగే ఈ సంస్థలు తాము పెట్టుకున్న కార్యాలయాలకు చెల్లిస్తున్న అద్దెకు, ఏజెంట్లకు ఇస్తున్న కమీషన్లకు, మార్కెటింగ్ తదితర కార్యకలాపాలకుగాను అన్ని దశల్లో ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లిస్తూపోతున్నాయి. చివరకు ఈ మొత్తాన్ని పాలసీ అమ్మకాల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయంలో మినహాయించుకొని మిగిలిన దాన్నే సర్కారుకు చెల్లిస్తున్నాయి. ఈ సర్దుబాటు సౌకర్యమే ఐటీసీ.
పాలసీలు మరింత ప్రియం
జీఎస్టీ ఎత్తివేతతో ఐటీసీ క్లెయిములకు ఆస్కారమే లేకుండా పోతున్నది. దీంతో తమ వ్యాపార కార్యకలాపాలకు చేసే చెల్లింపుల భారం ఇకపై కంపెనీలపైనే పడబోతున్నది. అందుకే ఈ భారాన్ని పాలసీదారులపైనే కంపెనీలు వేసే వీలుందని ఇండస్ట్రీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే జరిగితే పాలసీల బేస్ ప్రీమియం ధరలు 3 నుంచి 5 శాతం పెరగవచ్చని అంటున్నారు. కాబట్టి పాలసీదారులు చెల్లించే మొత్తాలు తగ్గినా.. ప్రీమియంపై జీఎస్టీ ఎత్తివేత పూర్తి ప్రయోజనం మాత్రం అందకపోవచ్చనే పేర్కొంటున్నారు.
ఉదాహరణకు.. గతంలో బేస్ ప్రీమియం నెలకు (జీఎస్టీని మినహాయించి) రూ.3,000 అనుకొంటే, ఇప్పుడు తాజా నిర్ణయంతో అది రూ.3,150 వరకూ పెరగొచ్చని అంచనా. ఇదే విషయాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్వో సమీర్ షా ఊటంకించారు. ‘బీమాపై జీఎస్టీని ఎత్తివేసినప్పటికీ, ఐటీసీపై ఆందోళనలు నెలకొన్నాయి. దాని ప్రభావం వినియోగదారులపై ఉంటుంది’ అని ఆయన తెలిపారు.
బేస్ టారిఫ్ పెరగొచ్చు
బీమాపై జీఎస్టీని ఎత్తేయడంతో కంపెనీలు ఐటీసీ నష్టాలను భర్తీ చేసుకోవడానికి బేస్ టారిఫ్లను 3 నుంచి 5 శాతం పెంచే అవకాశం ఉన్నది. దీంతో ప్రీమియంలో పెరుగుదల కనిపించవచ్చు.
-కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్
ప్రయోజనానికి కత్తెర
పాలసీదారులకు జీఎస్టీ లాభం అంతంతే. ఇన్సూరెన్స్ కంపెనీలు బేస్ టారిఫ్లను పెంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
-టిజో జోసెఫ్, సీఎఫ్వో, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్
బీమా సంస్థలు ఆలోచించాలి
ఐటీసీ నష్టపరిహారం విషయంలో బీమా కంపెనీలు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే జీఎస్టీ ఎత్తివేత పూర్తి ప్రయోజనాలు పాలసీదారులకు అందవు.
-రూరాష్ ఫైనాన్షియల్స్ ఎండీ రంజిత్ ఝా