Union Budget : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తంలో వివిధ రంగాలన్నింటికి కలిపి రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అంటే స్థూలంగా బడ్జెట్ పరిమాణం రూ.48.21 కోట్లు. ఇందులో మొత్తం ఆదాయాన్ని రూ.32.07 లక్షల కోట్లుగా, దానిలో పన్ను ఆదాయాన్ని రూ.28.83 లక్షల కోట్లుగా చూపించారు.
ఈ ఏడాది ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని బడ్జెట్లో అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా కట్టారు. అదేవిధంగా నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలోనూ, ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలోనూ సరళీకరణలు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. యూఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.