GDP | న్యూఢిల్లీ, జనవరి 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగానే ఉండొచ్చని గురువారం దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఎకనామిక్ ఔట్లుక్ సర్వే అంచనా వేసింది. అంతకుముందు ఇది 7 శాతంగా ఉంటుందని పేర్కొనగా.. ఇప్పుడు అర శాతానికిపైగా కుదించడం గమనార్హం. ఇక 2023-24 దేశ జీడీపీ వృద్ధిరేటు 8.2 శాతం గా ఉన్నది. ఈ క్రమంలో తాజా అంచనా మరింతగా వృద్ధిపై అనుమానాల్ని రేకెత్తిస్తున్నది. గత నెల డిసెంబర్లో ప్రముఖ ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగ నిపుణుల నుంచి సేకరించిన స్పందనలు, అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను ఫిక్కీ చేపట్టింది.
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులు స్పందిస్తూ.. స్వల్ప కాలంలో ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు మందగించవచ్చన్నారు. ఇక అధిక సుంకాలు, వీసా నిబంధనలు కూడా కొంత ఇబ్బందికరమేనన్నారు. రూపాయి మారకం విలువ స్థిరత్వాన్ని కోల్పోవచ్చని చెప్తున్నారు. ఇదిలావుంటే వ్యవసాయోత్పత్తి పెంపు, మెరుగైన గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, గిడ్డంగుల వ్యవస్థ బలోపేతం వంటివి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించగలవని సూచించారు.