న్యూఢిల్లీ, జూన్ 10: డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చేరింది. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా ఎఫ్డీలపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు సవరించింది.
రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 3 శాతం నుంచి 7.25 శాతం మధ్యలో ఉన్నది. దీంట్లో అత్యధికంగా 18 నెలల నుంచి 21 నెలల లోపు డిపాజిట్లపై వడ్డీరేటు 7.25 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు అర శాతం వడ్డీని అధికంగా చెల్లిస్తున్నది.