ముంబై, నవంబర్ 17 : అశ్వత్ దామోదరన్.. స్టాక్ మార్కెట్ మదుపరులకు పరిచయం అక్కర్లేని పేరు. వాల్‌స్ట్రీట్‌లో అత్యంత విశ్వసనీయమైన వాల్యుయేషన్ ఎక్స్పర్ట్ మరి. పక్కా అంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈయన.. ఇప్పుడు హాట్ కామెంట్స్ చేశారు. స్టాక్ మార్కెట్లలో ఏదో చెడు రాబోతోందన్న అశ్వత్ మాటలు.. ఇన్వెస్టర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే డాటా, డిసిప్లేన్.. ఈ రెండింటితో మోస్ట్ పాపులరైపోయిన అశ్వత్.. ఎన్నో ఏండ్ల నుంచి పెట్టుబడులు పెడుతున్నా ఈ రకంగా స్పందించడం మాత్రం ఇదే తొలిసారి. ‘మొదటిసారి నా సొమ్మును నగదు రూపంలోనే ఉంచాలని, కలెక్టబుల్స్ లేదా ఇతర భౌతిక ఆస్తుల్ని కొనేందుకు ఉపయోగించాలనిపిస్తున్నది’ అని చెప్పడం గమనార్హం.
కృత్రిమ మేధస్సు (ఏఐ) వృద్ధిపై ఊహాగానాలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఏ కోణంలోనూ సురక్షితం కాదంటూ అశ్వత్ దామోదరన్ కూడా బంగారం, నగదు, కలెక్టబుల్స్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటీవలి పాడ్‌కాస్ట్‌లో ఆయన హెచ్చరించారు. ‘వివిధ రంగాలకు మీ పెట్టుబడులను విస్తరించాలన్న సలహాలు ఇక స్టాక్ మార్కెట్లలో పనిచేయకపోవచ్చు. ఇన్నాళ్లూ సురక్షితంగా భావించిన ఈ పద్ధతికి నిష్క్రియాత్మక పెట్టుబడులు, ఇండెక్స్ ఫండ్స్ పెత్తనం స్వస్తి పలుకుతున్నాయి’ అని చెప్పారు. కాబట్టి సంప్రదాయ మదుపరులు తమ కేటాయింపులపై పునరాలోచించుకోవాలని కోరారు.
‘స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులను చూస్తే భయం వేస్తున్నది. అందుకే నేను నా సొమ్మును ఉంటే నగదుగానైనా ఉంచాలనుకుంటున్నాను లేదా దాంతో ఇతర భౌతిక ఆస్తులనైనా కొనాలనుకుంటున్నాను. సాధారణంగా బంగారాన్ని ఎలాంటి రాబడి ఇవ్వని ఆస్తిగా నేను చూస్తాను. కానీ ఇప్పుడు బంగారంపై పెట్టుబడులే సురక్షితం అనిపిస్తున్నది. ఇందుకు నాలో రేకెత్తిన భయమే కారణం. ఫండమెంటల్స్ కాదు. నిజానికి ఏడాదిగా బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. స్టాక్స్ పెట్టుబడుల్లో వృద్ధిరేటు 15 నుంచి 20 శాతంగా ఉంటే.. బంగారంపై అది 60 నుంచి 70 శాతంగా ఉన్నది. దీన్నిబట్టి స్టాక్ మార్కెట్లలో ఏదో చెడు జరుగబోతున్నదనిపిస్తున్నది’ అని అన్నారు. ఈ క్రమంలోనే త్వరలో స్టాక్ మార్కెట్లలో మహా పతనం చోటు చేసుకోవచ్చని, 30 నుంచి 35 శాతం లేదా అంతకంటే ఎక్కువగానే నష్టాలు వాటిల్లవచ్చని హెచ్చరించారు. కనుక స్టాక్స్ లేదా బాండ్లు రెండింటిలోనూ పెట్టుబడులు ఇక సురక్షితం కావని అశ్వత్ అంటున్నారు. మరింత భిన్నంగా ఆలోచించి మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.