Air India | ఫారెక్స్ మార్కెట్లో యూఎస్ డాలర్ మీద రూపాయి మారకం విలువ పతనం కావడంతో తమ కాస్ట్ స్ట్రక్చర్ మీద, కంపెనీ లాభాల మీద ఒత్తిడి పెంచుతున్నది. దీనివల్ల విదేశీ కరెన్సీలో ఎయిర్ ఇండియా విమాన టికెట్ల ధరలు పెరుగుతాయని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఇటీవలి కాలంలో ఈ నెల పదో తేదీన ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.86.04లకు పతనమైంది. రూపాయి బలహీనంతో అన్ని విమానయాన సంస్థల నిర్వహణా ఖర్చులు ఎక్కువవుతాయి.
రూపాయి మారకం విలువ మరింత పతనం కావడంతో విమానయాన పరిశ్శ్రమకు, ఎయిర్ ఇండియాకు సవాల్‌గా పరిణమిస్తుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ చెప్పారు. అయితే, భారం తగ్గించుకునేందుకు ఇతర చర్యలు చేపడతామన్నారు. మరింతగా రూపాయి మారకం విలువ పతనమైతే కంపెనీ లాభాలపై ప్రభావం పడుతుందన్నారు.
దేశీయంగా ఎయిర్ఇండియా గ్రూప్ ప్రతి రోజూ 1168 విమాన సర్వీసులు నడుపుతోంది. వాటిల్లో 313 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. విదేశీ విమాన సర్వీసుల్లో 244 షార్ట్ హౌల్, మిగతా 69 లాంగ్ హాల్ కేంద్రాలని తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఇటీవలే విలీనం అయ్యాయి. గతేడాది ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్ లైన్స్, ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం అయ్యాయి.