హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యానికి వెన్నెముకలా నిలిచే వైద్యులు పనిభారంతో సతమతం అవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్య ఆలోచనలు చేస్తుండటం తీవ్ర ఆందోళన రేపుతున్నది. తాజాగా ది ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్(ఫైమా) దేశవ్యాప్తంగా ‘రివ్యూ మెడికల్ సిస్టమ్(ఆర్ఎంఎస్) 2.0’ పేరిట నిర్వహించిన సర్వే వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చింది.
దేశవ్యాప్తంగా 28 రాష్ర్టాలు, యూటీలు కలిపి 1,260 మంది రెసిడెంట్ డాక్టర్ల నుంచి సేకరించిన డాటా ఆధారంగా ఈ సర్వే రూపొందించినట్టు ఫైమా తెలిపింది. ఇందులో 87.5 శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తేలింది. 87.8 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడించింది. 61.8 శాతం మంది 36 గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నది. 63.7 శాతం డ్యూటీ పూర్తయిన తర్వాత కనీసం విశ్రాంతి కూడా తీసుకోవడం లేదని వెల్లడించింది.
ఈ కారణాలతో 54.4 శాతం మంది రెసిడెన్సీ(తమ పీజీ సీటు) వదిలి వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని వివరించింది. 16.9 శాతం మంది ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 69.1 శాతం మంది తీవ్రమైన పని భారం ఉందని తెలిపారు. 46.7 శాతం మంది వారానికి 80 గంటలు పని చేస్తున్నామని, 20.3 శాతం మంది వారానికి 100 గంటలకు పైగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యరంగంలో సిబ్బంది కొరత, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యవస్థ లేకపోవడం, సకాలంలో ైస్టెఫండ్ అందకపోవడం, బాండ్ పాలసీలు (కోర్సు మధ్యలో వదిలి వెళితే విధించే భారీ జరిమానాలు), పనిభారంతో అకడమిక్ కోర్సుపై ఎఫెక్ట్ పడుతున్నదని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
రెసిడెంట్ డాక్టర్ల సంరక్షణకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సర్వే సూచించింది. రెసిడెంట్ డాక్టర్ల పనివేళలపై జాతీయ స్థాయిలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేసింది. ఎక్కువ సేపు షిఫ్టుల్లో పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని, వైద్యుల కొరతను తీర్చేందుకు వెంటనే నియామకాలు చేపట్టాలని పేర్కొన్నది.
ఏకధాటిగా 36 గంటల డ్యూటీలు వేయవద్దని కోరింది. ప్రతి మెడికల్ కాలేజీలో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే విధమైన ైస్టెఫండ్ విధానం అమలు చేయాలని, బాండ్ పాలసీ, జరిమానాల్లో సవరణలు చేయాలని, ఎప్పటికప్పుడు రెసిడెంట్ డాక్టర్ల సంక్షేమాన్ని మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలని సూచించింది. రోగుల భద్రత, నాణ్యమైన వైద్య విద్యను దృష్టిలో ఉంచుకొని రెసిడెంట్ డాక్టర్ల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని సర్వే అభిప్రాయపడింది.