హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ-ఆస్ట్రేలియా’ మధ్య వాణిజ్య, సాంకేతిక సహకారానికి కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో మంత్రిని విక్టోరియా(ఆస్ట్రేలియా) శాసనమండలి ప్రభుత్వ విఫ్ లీ టార్లామిస్ భేటీ అయ్యారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు.
ఈ క్రమంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతని ఇస్తున్నట్టు వివరించారు. పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ అత్యంత అనుకూలమని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్, విద్య, నైపుణ్యాభివృద్ధి, అడ్వాన్స్ మ్యాన్ఫ్యాక్చరింగ్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాల్లో దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.