న్యూఢిల్లీ, జూన్ 1 : దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పడకేసింది. కీలక రంగాలను మందగమనం ఆవరించింది. ఏప్రిల్ నెలలో నమోదైన ఐఐపీ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. 4.9 శాతం వృద్ధికే పరిమితమైంది మరి. గత ఏడాది ఏప్రిల్‌లో ఇది 5.7 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో ఏడాది వ్యవధిలో దాదాపు 1 శాతం వృద్ధి క్షీణించినైట్టెంది. ముఖ్యంగా ఇంధన ఆధారిత రంగాలు కుదేలయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం తీవ్రత కనిపించినట్టు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఈ ఏప్రిల్ నెలకుగాను సోమవారం విడుదలైన ఐఐపీ గణాంకాలను 2022-23 సంవత్సరం ఆధారం (బేస్ ఇయర్)గా లెక్కించారు. అంతకుముందు నెల మార్చి వరకు 2011-12 బేస్ ఇయర్‌గా విడుదలయ్యాయి. కాగా, ఇప్పటిదాకా ఐఐపీ బేస్ ఇయర్‌ను 10సార్లు సవరించారు. మొదటిది 1937గా ఉండేది. ఇదిలావుంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్‌లో ప్రతికూల వృద్ధిరేటు నమోదైంది. మైనస్ 5.1 శాతానికి దిగజారింది. ఇక తయారీ రంగంలో 6.2 శాతం, ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సరఫరాలో 4.9 శాతం, సీవరేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో 6.6 శాతం వృద్ధి కనిపించినట్టు ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఐఐపీ గణన ప్రక్రియలో కొత్తగా 120 ఐటెమ్ గ్రూపులు వచ్చి చేరాయి. అందులో డెబిట్, క్రెడిట్ కార్డుల వంటి మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులు, సీసీటీవీ కెమెరాలు, నాన్-ఓవెన్ టెక్స్టైల్స్ ఆర్టికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, స్టెంట్లు, వ్యాక్సిన్లు మొదలైనవి ఉన్నాయి.
ఐఐపీలో తయారీ రంగం వాటానే 77.6 శాతంగా ఉన్నది. ఆ తర్వాత గనులు-తవ్వకాల రంగాల వాటా 14.4 శాతంగా ఉన్నది. మిగతా 8 శాతాన్ని విద్యుత్తు-గ్యాస్ సరఫరా, వ్యర్థాల నిర్వహణ పంచుకుంటున్నాయి. అయితే ఐఐపీలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ మందగమనం.. ప్రధానంగా తయారీ రంగంలో నిస్తేజాన్ని చాటుతున్నది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల పేరుతో దేశంలో పెట్రో ధరలను మోదీ సర్కార్ పెద్ద ఎత్తున పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం నేరుగా తయారీ రంగంపైనే పడుతున్నది. పెరిగిన రవాణా ఖర్చులతో ముడి సరుకులు ఖరీదెక్కుతున్నాయి. ఫలితంగా ఉత్పాదక వ్యయం ఎగిసి అన్ని వస్తూత్పత్తుల ధరలు మార్కెట్లో ఎగబాకుతున్నాయి. దీంతో వాటి అమ్మకాలు ప్రభావితమవుతుండగా.. తయారీదారులు ఉత్పత్తికి కోతలు పెట్టాల్సి వస్తున్నదని ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి దేశంలో అమ్మే పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల ధరల్లో ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు, సుంకాల వాటానే ఎక్కువని ఆర్థిక నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ట్యాక్స్‌లు, డ్యూటీలు, సెస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకుంటే బాగుంటుందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతుండటం గమనార్హం.
ఐఐపీలో వృద్ధి పతనంతో కోర్ ఇండస్ట్రీల్లోనూ మందగమనం ఛాయలుంటాయని చెప్తున్నారు. ఐఐపీలో 8 కీలక రంగాల వాటా 40 శాతంపైనే. వీటిలో పెట్రోలియం రిఫైనరీ, విద్యుత్తు, ఉక్కు, బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంట్, ఎరువుల ఉత్పత్తులున్నాయి. కాగా, దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా, అందులో మెజారిటీ వాటా గల్ఫ్ దేశాలదే. అయితే యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌కు అండగా ఉంటున్నాయని ఇరాన్ తమ పొరుగు దేశాలపై దాడులు చేస్తున్నది. దీంతో యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ, బహ్రెయిన్ దేశాల్లో ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు సముద్ర రవాణాలో కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం కూడా భారత్‌కు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ 8 కీలక రంగాల్లో ఉత్పాదకత పడిపోతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే రాబోయే ఇన్ఫ్రా సెక్టార్ గణాంకాలు నిరుత్సాహకరంగానే ఉంటాయని చెప్పవచ్చు.