ఫేస్బుక్ వ్యాపారం ప్రభావితం కావడానికి యూజర్ల పోటీ ఒక కారణం. వర్చువల్ రియాల్టీ వ్యాపారం సమీప భవిష్యత్తులో లాభసాటిగా ఉండదు.
– మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీఈవో
న్యూయార్క్, ఫిబ్రవరి 3: ప్రపంచ మార్కెట్ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. ఇంటర్నెట్ దిగ్గజం ఫేస్బుక్ స్టాక్ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. అమెరికాలో గురువారం మార్కెట్ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ షేర్లు 25 శాతం కుప్పకూలాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ ఒక్కసారిగా 200 బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) పడిపోయింది. 2022 జనవరి-మార్చి క్వార్టర్లో ఆదాయ వృద్ధి తగ్గుతుందంటూ హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను తెగనమ్మారు. ఫలితంగా మెటా షేరు 25 శాతంపైగా పతనమై 52 వారాల కనిష్ఠస్థాయి 237 డాలర్ల వద్దకు పడిపోయింది. ఈ స్థాయి వద్ద కంపెనీ మార్కెట్ విలువ 688 బిలియన్ డాలర్లు. ఈ విలువ 880 బిలియన్ డాలర్ల నుంచి నిలువునా 200 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. క్రితం రోజు ఈ షేరు 323 డాలర్ల వద్ద ముగిసింది.
తగ్గిన యూజర్లు, పెరిగిన పోటీ
ఫేస్బుక్ రోజువారీ గ్లోబల్ యాక్టివ్ యూజర్లు డిసెంబర్ త్రైమాసికంలో 192.9 కోట్లకు తగ్గారు. ఫేస్బుక్ కార్యకలాపాల్ని ప్రారంభించిన తర్వాత యూజర్లను కోల్పోయిన త్రైమాసికం ఇదే. 2021 సెప్టెంబర్ క్వార్టర్లో యూజర్ల సంఖ్య 193 కోట్లు. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రైవసీకి సంబంధించి చేసిన మార్పులు, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ పెరగడంతో తమ పనితీరు మందగించినట్టు మెటా తెలిపింది. యాపిల్ చేసిన మార్పులతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలపై వివిధ బ్రాండ్లు వాటి ప్రకటనల ప్రభావాన్ని తెలుసుకోలేకపోతున్నారన్నది. టిక్‌టాక్, గూగుల్ యూ ట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌తో ఒత్తిడి ఏర్పడుతున్నదని, వచ్చే త్రైమాసికంలో ఆదాయ వృద్ధి తగ్గుతుందని వివరించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం 27 బిలియన్ డాలర్ల నుంచి 29 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని మెటా తాజా అంచనాల్లో వెల్లడించింది. ఇది 30.15 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చన్న విశ్లేషకుల అంచనాలకంటే తక్కువ. యాపిల్ ప్రైవసీ మార్పుల ప్రభావం తమ సంస్థపై 2022లో 10 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని మెటా సీఎఫ్‌వో వెల్లడించారు. వర్చువల్ రియాల్టీ వ్యాపారాన్ని నిర్వహించే రియాల్టీ ల్యాబ్స్ నష్టాలు 2021లో 10.2 బిలియన్ డాలర్లకు పెరిగింది.
ఇతర ఇంటర్నెట్ స్టాక్స్‌లోనూ అమ్మకాలు
మెటా ప్లాట్‌ఫామ్స్ ప్రభావం ఇతర ఇంటర్నెట్ షేర్లపైనా పడింది. ట్విట్టర్, స్నాప్, పింటరెస్ట్ కంపెనీల షేర్లు సైతం పతనమయ్యాయి. వీటి మార్కెట్ విలువ 15 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. రెండు రోజుల క్రితం అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ షేరు తాజాగా 2 శాతంపైగా పడిపోయింది. మొబైల్ ఇంటర్నెట్ స్థానాన్ని మెటావర్స్ ఆక్రమిస్తుందన్న అంచనాలతో కంపెనీ పేరును ఫేస్బుక్ నుంచి మెటా ప్లాట్‌ఫామ్స్‌గా ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే.