హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : పంటల వైవిధ్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ వానకాలంలో పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగి దేశంలోనే రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో భాగంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని వివరించడంతోపాటు రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు.
మొకజొన్న, జొన్న పంటలను కేంద్రమే కొనుగోలు చేయాలని, ఈ పంటలను ధరల మద్దతు పథకం(పీఎస్ఎస్)పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణలో విత్తనరంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైతు ప్రయోజనాలను కాపాడేలా కొత్త సీడ్ బిల్లును తీసుకురావాలని మంత్రి కోరారు.
పంట నష్టాల సందర్భంలో రైతులకు పరిహారం అందించే నిబంధనలతోపాటు నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు అన్ని విధాలా సహకరించాలని కోరారు. తుమ్మల విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి తుమ్మల తెలిపారు.