ముంబై, నవంబర్ 25: షేరు విక్రయదారులకు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శుభవార్తను అందించింది. షేరును విక్రయించిన రోజే సెటిల్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధాబి పూరి బచ్ తెలిపారు. ఇప్పటికే బయ్యర్, సెల్లర్కు మధ్య ఉన్న లావాదేవీలను గడువును తగ్గించే పనిలోనే ఉన్నదని, వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ పరిమితిని ఒక్క రోజుకు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం టీ+1 అంటే విక్రయించిన రోజు నుంచి రెండు రోజుల తర్వాత షేరు విక్రయించిన వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవి. కానీ, ఈ వినూత్న నిర్ణయంతో టీ+0 అంటే షేరు విక్రయించిన రోజే ఖాతాదారుడి అకౌంట్లో డబ్బు జమకానున్నాయి.
ఇందుకు సంబంధించి మార్కెట్ వర్గాల నుంచి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సెటిల్మెంట్తోపాటు ఈ కొత్త సెటిల్మెంట్ను కూడా ఒకేసారి పరిశీలించనున్నట్లు, ఆ తర్వాతికాలంలో షేర్ల విక్రయదారులు ఏదైనా ఎంచుకునే అవకాశం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. గతంలో టీ+2 ఉండేదని, ఈ ఏడాది జనవరి నుంచి దీనిని టీ+1కి తగ్గించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కొత్త నిబంధనను అమలు చేయాలంటే టెక్నాలజీ పరంగా విసృతంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని, అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు, ఇండెక్స్ ప్రొవైడర్ల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను సెబీ ప్రవేశపెట్టింది. ఇండెక్స్ ప్రొవైడర్ల నుంచి లాభాపేక్షలేని సంస్థల నిధుల సేకరణకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.