హైదరాబాద్, ఫిబ్రవరి 11 : క్షిపణుల తయారీలో కీలక విడిభాగాల తయారీ సంస్థ ఎంటార్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో) రూ.16 కోట్ల పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10.4 కోట్లతో పోలిస్తే 52.8 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.118.4 కోట్ల నుంచి నుంచి రూ.174.50 కోట్లకు ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, ప్రమోటర్ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల నుంచి రూ.400 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని, దీంతో ఆర్డర్ల బుకింగ్ మరింత పెరిగిందన్నారు. భవిష్యత్తులో న్యూక్లియర్ రంగం నుంచి కూడా ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉన్నదన్నారు.