న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో వాణిజ్యాన్ని సరళతరం చేస్తున్నామంటూ బీరాలు పలుకుతున్న నరేంద్ర మోది ప్రభుత్వ హయాంలో ఇక్కడ వ్యాపారం కఠినతరంగా మారిందంటూ అంతర్జాతీయ కంపెనీ ఒకటి దుమ్మెత్తిపోసింది. ప్రపంచంలో రెండో పెద్ద లిక్కర్ తయారీ కంపెనీ ఫ్రాన్స్‌కు చెందిన పెర్నార్డ్ రికార్డ్..భారత్‌లో కొత్త పెట్టుబడుల్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ప్రాచుర్యం పొందిన లిక్కర్ బ్రాండ్లు చివాస్ రీగల్, గ్లెన్లివెట్ స్కాచ్ విస్కీ, అబ్సలుట్ వోడ్కాల్ని ఉత్పత్తి చేసే పెర్నార్డ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గత ఏడాది మోదీ కార్యాలయానికి లేఖరాసినా ప్రయోజనం లేకపోవడంతో తాజా పెట్టుబడులకు బ్రేక్వేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోకి తెచ్చే లిక్కర్ దిగుమతుల విలువ గణనపై దీర్ఘకాలంగా పన్ను వివాదాలు తలెత్తుతున్నాయని పెర్నార్డ్ ఆరోపిస్తున్నది. భారత్‌లో 2,000 కోట్ల డాలర్ల ఆల్కహాల్ మార్కెట్లో పెర్నార్డ్కు 17 శాతం వాటా ఉండగా, డియాజియోకు 29 శాతం వాటా ఉంది.
విలువ పెంచి, సుంకాలు చెల్లించమంటున్నారు
దేశంలోకి దిగుమతయ్యే విదేశీ ఆల్క్హాల్పై 150 శాతం సుంకం విధిస్తారు. పెర్నార్డ్ రెండు రకాలుగా లిక్కర్‌ను తీసుకొస్తుంది. ఇక్కడ లిక్కర్ తయారుచేయడానికి కాన్సట్రేటెడ్ ఆల్కహాల్‌ను దిగుమతి చేసుకోవడంతో పాటు చివాస్ రీగల్ వంటి ఉత్పత్తుల్ని బాటిళ్ల రూపంలోనే తీసుకొస్తుంది. ఈ రెండు రకాల మద్యాలపై పెర్నార్డ్ వ్యయ పద్దతుల్ని, పన్నుల చెల్లింపును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వివాదాలు ట్రిబ్యునళ్లలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చివాస్ వంటి బాటిల్డ్ ఆల్క్‌హాల్ దిగుమతి విలువకు అడ్వైర్టెజ్‌మెంట్, ప్రమోషన్ వ్యయాలు కలిపి, ఆ మొత్తంపై సుంకాలు చెల్లించమంటున్నారు. దీంతో కంపెనీకి చెందిన నిల్వలు పలు పోర్టుల్లో నిలిచిపోయాయి.
ఈ అంశంపై గత నెలలో సీబీఐసీకి ఒక లేఖ రాసి, దానిని నరేంద్ర మోదీ కార్యాయానికి అటాచ్ చేసింది.ఇలా దిగుమతుల విలువను లెక్కించడం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నదని, తమ విస్తరణ ప్రణాళికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నదని ఆరోపించింది. తాజా పెట్టుబడులతో భారత్‌లో కొత్తగా ప్రొడెక్షన్ లైన్స్ నెలకొల్పాలని పెర్నార్డ్ గతంలో సంకల్పించింది. 2025 కల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 శాతం పెంచుకుని, వచ్చే ఐదేండ్లలో భారత్ నుంచి తమ ఎగుమతుల ఆదాయాన్ని 126 మిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కఠిన నిబంధనల కారణంగా విదేశీ కంపెనీలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై అధిక సుంకాల కారణంగా అమెరికా దిగ్గజం టెస్లా సైతం పెట్టుబడికి విముఖత చూపిన సంగతి తెలిసిందే.