LIC IPO | ఎల్ఐసీ ఐపీవో పట్ల యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి పూర్తి మద్దతు లభించింది. సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి బిడ్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. కేవలం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచే ఎల్ఐసీకి రూ.5627 కోట్ల నిధులు వచ్చాయి. యాంకర్ ఇన్వెస్టర్లు దాఖలు చేసిన బిడ్ల ప్రకారం ఒక్కో షేర్‌ను గరిష్టంగా రూ.949కే కేటాయించినట్లు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో దాఖలు చేసిన ఫైలింగ్‌లో వెల్లడించింది.
యాంకర్ ఇన్వెస్టర్లకు ఎల్ఐసీ 5.9 కోట్లషేర్లు కేటాయించింది. 99 పథకాల ద్వారా దేశంలోని 15 మ్యూచువల్ ఫండ్ సంస్థలకు 4.2 కోట్ల షేర్లు కేటాయించింది. ఎల్ఐసీ షేర్ల కోసం ఐసీఐసీఐ ఫ్రూడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్, పీఎన్బీమెట్లైఫ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్ స్కీం తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇంకా బీఎన్పీ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్పీ, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, తదితర విదేశీ సంస్థలు బిడ్లు వేశాయి.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఎల్ఐసీ ఐపీవో బుధవారం మొదలై ఈ నెల 9న ముగుస్తుంది. ఎల్ఐసీలో ఐపీవో ద్వారా కేంద్రం రూ.21 వేల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక నిధులు సేకరించిన ఐపీవోగా ఎల్ఐసీ ఐపీవో నిలువనున్నది. ఇప్పటి వరకు గతేడాది రూ.18,300 కోట్ల నిధులు సేకరించిన పేటీఎం ఐపీవో, 2010లో రూ.15,200 కోట్లు సేకరించిన కోల్ ఇండియా ఐపీవో.. తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.