హైదరాబాద్, జూలై 12: ప్రముఖ ఈవీ చార్జింగ్ సదుపాయాలు సమకూరుస్తున్న ఈవీఆర్ఈ..హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్క్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ యూనిట్‌ను రూ.10 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నట్టు కంపెనీ ఫౌండర్, సీఈవో కృష్ణ కే జాస్తి తెలిపారు. ఈ యూనిట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 250 నుంచి 300 మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
నెలకు 25 వేల యూనిట్ల చార్జింగ్ స్టేషన్ల తయారీ సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నగరానికి సమీపంలో పటాన్చెరు వద్ద ఉన్న యూనిట్లో 3.3 కిలోవాట్ల నుంచి 360 కిలోవాట్ల డీసీ వేగవంతమైన చార్జింగ్ స్టేషన్లు తయారవుతున్నాయి. ప్రస్తుతం సంస్థ రెండు రకాల చార్జర్లను విక్రయిస్తున్నది. వీటిలో 3-22 కిలోవాట్ల స్లో చార్జర్ కాగా, అలాగే 30-240 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్లను విక్రయిస్తున్నది. వీటి ధర రూ.15 వేల నుంచి రూ.15 లక్షల లోపు లభించనున్నాయి.
ప్రస్తుతం సంస్థ చేతిలో 4 వేల చార్జింగ్ స్టేషన్ల ఆర్డర్లు ఉన్నాయని, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్య 10 వేలకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు సంస్థ 10 వేల యూనిట్లను ఇన్స్టాల్ చేసింది. చార్జింగ్ విషయంలో కారు యాజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను తీర్చిదిద్దినట్టు, తద్వారా చార్జింగ్ స్థలంలో ఎలాంటి వాహనం ఉన్నదో లేదో ముందస్తుగానే తెలుసుకోవచ్చునన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు, కోల్‌కతాలో రెండు వేలకు పైగా చార్జింగ్ పాయింట్లను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అలాగే అపార్ట్మెంట్ సొసైటీల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నట్టు, ఇందుకోసం పలు రియల్ ఎస్టేట్ సంస్థలతో జట్టుకట్టినట్టు చెప్పారు.