న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)లోకి గత నెల మార్చిలో నికరంగా రూ.40,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెల ఫిబ్రవరితో పోల్చితే ఇది 56 శాతం అధికం. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన 40 రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా సూచీలు అమ్మకాల ఒత్తిడికే లోనయ్యాయి. అయినప్పటికీ ఈ స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్.. మదుపర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. అంతేగాక గత ఏడాది జూలై తర్వాత ఒక్క నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. నాడు నికర పెట్టుబడులు రూ.42,702 కోట్లుగా ఉన్నాయి.
ఇదిలావుంటే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్‌లు) ద్వారా వచ్చిన నెలవారీ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకుతూ రూ.32,087 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో ఇవి రూ.29,845 కోట్లుగా ఉన్నాయని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. క్రమశిక్షణ, వ్యవస్థీకృత పెట్టుబడులకు మదుపర్లు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతున్నదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా, మార్చిలో ఈక్విటీలు సహా మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి నికరంగా పెట్టుబడుల ఉపసంహరణలు రూ.2.4 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో నికరంగా రూ.94,530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డెట్ మార్కెట్ల నుంచి మార్చిలో మదుపర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులను వెనుకకు తీసుకోవడమే ఇందుకు కారణం.