Higher Pension | ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వేతన జీవుల్లో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ మీద ఆశలు పెట్టుకున్న వారికి రిలీఫ్ లభించింది. అధిక వేతనంపై ఈపీఎఫ్ వాటా పే చేస్తున్న మేనేజ్మెంట్లు, ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు.. పేరా 26(6) రూల్ కింద తప్పనిసరి పర్మిషన్ తీసుకోవాలన్న పత్రం అందజేయాలన్న నిబంధనపై ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వెనుకడుగు వేసింది. దానికి బదులు అధిక పెన్షన్ దరఖాస్తుల ఆమోదం వేళ పరిశీలించే పత్రాలపై క్లారిటీ ఇచ్చింది. కాగా, అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండటం గమనార్హం.
అధిక పెన్షన్ కోసం అర్హత గల ఉద్యోగులు తమకు పెన్షన్ మంజూరయ్యేలోపు ఎప్పుడైనా మేనేజ్మెంట్తో కలిసి 26(6) పేరా కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వొచ్చునని ఈపీఎఫ్ఓ పెన్షన్ రీజినల్ కమిషనర్ అప్రజిత జగ్గీ ఆదేశించారు.
మరోవైపు ఈ నెల రెండో తేదీన పేరా 26 (6) కింద రిలీఫ్ ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను స్పష్టత పేరిట వెబ్ సైట్ నుంచే తొలగించింది. తాజాగా 26(6) నిబంధన కింద మేనేజ్మెంట్ తో కలిసి ఉద్యోగి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్.. ఈపీఎఫ్ఓ సహాయ కమిషనర్ స్థాయి అధికారి ఆమోదించాలి. ఆప్షన్ కాపీ దరఖాస్తుతోపాటు జత చేయాలని వివరించింది.
సదరు ఉద్యోగి వేతనం గరిష్ట పరిమితి దాటినప్పటి నుంచి రిటైర్మెంట్ వరకు అధిక వేతనంపై యాజమాన్యం పీఎఫ్ వాటా పే చేసినట్లు ఆధారాలు ఉండాలి. అధిక వేతనంపై అధిక పీఎఫ్ పే చేసినందుకు మేనేజ్మెంట్ చార్జీలు పే చేయాలి. ఈపీఎఫ్ పేరా 60 ప్రకారం అధిక వేతనంపై తీసుకున్న వాటా, ఆ మేరకు చెల్లించిన వడ్డీ ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో అప్ డేట్ కావాలి.
26(6) పేరా పరిధిలోకి వచ్చే పత్రాల స్థానంలో ఉద్యోగితోపాటు యాజమాన్యం సమర్పించిన వేతన వివరాలు గానీ/ యజమాని ధ్రువీకరించిన వేతన పత్రం లేదా లెటర్/ ఆప్షన్ అప్పీల్, యజమాని అండర్ టేకింగ్/ అధిక వేతనంపై పీఎఫ్ పే చేసినట్లు 2022 నవంబర్ 4కి ముందు పీఎఫ్ కార్యాలయం జారీ చేసిన లేఖ ఉండాలని పరిగణించింది.