EPFO | వివిధ సంస్థల్లో పని చేస్తూ ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) లో సబ్స్క్రైబర్లుగా ఉన్న వారికి కీలక అప్ డేట్ అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ నిల్వలపై 8.25 శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. 2023-24 మధ్యలో గానీ, 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గానీ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న తమ సబ్ స్క్రైబర్లకు సవరించిన వడ్డీ ప్రకారమే చెల్లింపులు జరుపుతామని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా తెలిపింది.
సాధారణంగా ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటును ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత త్రైమాసికంలో ఖరారు చేస్తారు. తదనుగుణంగానే 2023-24 ఆర్థిక సంవత్సర వడ్డీరేటును గత మే నెలలో ఖరారు చేశామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధికం అని వివరించింది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్, జీపీఎఫ్, పీపీఎఫ్ వంటి పథకాలపై వడ్డీరేట్లకంటే ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీరేటు అధికం అని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ నిల్వలపై 8.15 శాతం వడ్డీని కేంద్రం నిర్ణయించింది.
గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నోటిఫై చేసిన వడ్డీరేటు ప్రయోజనాలు అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకుంటున్న సభ్యులందరికీ అదే వడ్డీ చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఖాతాదారులకు త్వరలోనే అదే వడ్డీరేటు అందుతుందని తెలిపింది. అయితే, ఎప్పుడు పీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుందన్న సంగతి మాత్రం వెల్లడించలేదు.