Tata Nexon | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారత్ మార్కెట్లోకి టాటా నెక్సాన్ (Tata Nexon) న్యూ ఎంట్రీ లెవల్ వేరియంట్ కార్లను ఆవిష్కరించింది. పెట్రోల్ మోడల్లో స్మార్ట్ (ఓ), డీజిల్ మోడల్లో స్మార్ట్ +, స్మార్ట్ + ఎస్ కార్లు ఉంటాయి. కొత్తగా మార్కెట్లోకి ఎంటరైన నెక్సాన్ వేరియంట్లు.. మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3X0) కారుతో ఢీకొడతాయి. టాటా నెక్సాన్ స్మార్ట్ (ఓ) పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో వచ్చిన స్మార్ట్ + వేరియంట్ రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.10.59 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతాయి.
టాటా నెక్సాన్ న్యూ వేరియంట్లు అందుబాటు ధరలో ఉన్నాయి. పాత స్మార్ట్ మోడల్ కారుతో పోలిస్తే న్యూ స్మార్ట్ (ఓ) పెట్రోల్ వేరియంట్ రూ.15 వేలు, స్మార్ట్ + వేరియంట్ రూ.30 వేలు, స్మార్ట్ + ఎస్ వేరియంట్ రూ.40 వేలు తక్కువ ధరకు లభిస్తాయి. టాటా నెక్సాన్ టాప్ వేరియంట్ రూ.14.74 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్ మార్కెట్లో కియా సొనెట్, మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మోడల్ కార్లతో పోటీ పడుతుంది.
న్యూ ఎంట్రీ లెవల్ టాటా నెక్సాన్ కారులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, డ్రైవ్ మోడ్, ఇల్యూమినేటెడ్ లోగోతోపాటు ట్విన్ స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్, సేఫ్టీ కోసం రివర్స్ పార్కింగ్ సెన్సర్ 6-ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) వంటి ఫీచర్లు ఉంటాయి. టాటా నెక్సాన్ మరింత స్పోర్టీ, మోడ్రన్‌గా ఉంటుంది. ఫ్రంట్‌లో న్యూ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, న్యూ డిజైన్డ్-మోర్ స్పోర్టీ లుకింగ్ బంపర్ కింద ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ అమరుస్తారు.
టాటా నెక్సాన్ రేర్‌లో 16-అంగుళాల డైమండ్ కట్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫుల్లీ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ (ఎక్స్ ఫ్యాక్టర్ టెయిల్ ల్యాంప్), వెల్ కం, గుడ్ బై పంక్షన్లు ఉంటాయి. ఆరు కొత్త రంగుల్లో టాటా నెక్సాన్ కారు లభిస్తుంది. ఫియర్ లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషియన్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టిన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుందీ కారు.
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కారు టూ-స్పోక్, ఫ్లాట్ బాటం స్టీరింగ్ వీల్, డాష్ బోర్డు దిగువన టచ్ ప్యానెల్ హెచ్‌వీఏసీ యూనిట్, సెంటర్ లో న్యూ గేర్ సెలెక్టర్ వంటి ఆప్షన్లతో ఈ కారు మరింత లగ్జరీగా కనిపిస్తుంది. టాటా నెక్సాన్ 1.2 లీటర్ల త్రీ సిలిండర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 118 హెచ్‌పీ విద్యుత్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113 హెచ్‌పీ విద్యుత్ వెలువరిస్తుంది.
టాటా నెక్సాన్ వేరియంట్లను బట్టి నాలుగు వేర్వేరు ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, న్యూ 7-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ తోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.