హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదురొనేలా ప్రపంచస్థాయి సదుపాయాలతో కూడిన సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. మలేషియా -పెనాంగ్ డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు.
చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతున్నదని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు పేరొన్నారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదన్నారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్‌కు ఉన్న అనుభవం.. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వైబీ జగదీప్ సింగ్ దియో చెప్పారు. ఇరు ప్రాంతాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని పేరొన్నారు.