Gratuity | ప్రైవేట్ కంపెనీల్లో ఈపీఎఫ్ సదుపాయాన్ని అందుకొనే ఉద్యోగులకు ఐదేండ్ల తర్వాత గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని లెక్క ఏమిటి? అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి ఐదేండ్లలోపే సర్వీసు ఉన్నప్పటికీ ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం ఏర్పడ్డా, లేదా చనిపోయినా గ్రాట్యుటీకి అర్హులే. ఇక ఈ గ్రాట్యుటీ లెక్కింపు విషయానికొస్తే.. ఉదాహరణకు ఓ కంపెనీలో పనిచేస్తున్న ఉదయ్‌కి అక్కడ ఆరేండ్ల అనుభవం ఉన్నది. ఆయన బేసిక్ సాలరీ, డీఏ కలిపి నెలకు రూ.30,000 వస్తున్నది. అప్పుడు గ్రాట్యుటీ రూ.1,03,846 వస్తుంది. ఇందుకు వర్తించే లెక్క ఏమిటంటే? కంపెనీలో ఉదయ్కున్న అనుభవం (6 ఏండ్లు)తో ఆయన నెల బేసిక్ సాలరీ, డీఏ (రూ.30,000) మొత్తాన్ని గుణించాలి.
ఆ వచ్చిన మొత్తం (రూ.1,80,000)ను 15/26 ఫార్ములాతో మళ్లీ గుణించాలి. అప్పుడు రూ.1,03,846 వస్తుంది. ఇదే ఆరేండ్ల కాలానికిగాను ఉదయ్‌కు వచ్చే గ్రాట్యుటీ మొత్తం. ఇలా ఎన్నేండ్లు పనిచేస్తే అన్నేండ్లు, అప్పటి వారి బేసిక్ పే, డీఏలతో కలిసి గుణించి, ఆ మొత్తానికి 15/26తో మళ్లీ గుణిస్తే గ్రాట్యుటీ వచ్చేస్తుంది. ఉద్యోగి రాజీనామా చేసి వెళ్లిపోయేటప్పుడు కంపెనీలు ఈ లెక్కనే పాటించి చెల్లిస్తాయి. ఒకవేళ మీరు 12 ఏండ్ల 6 నెలలు లేదా 13 ఏండ్ల 6 నెలలు పనిచేస్తే అప్పుడు అక్కడ మీ అనుభవాన్ని 13 లేదా 14 ఏండ్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే గ్రాట్యుటీ రూ.10 లక్షలు దాటితే దానిపైన ఉండే మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియాగా పిలుస్తూ చెల్లిస్తారు.