న్యూఢిల్లీ, ఆగస్టు 18: లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, తయారీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ఆయా కంపెనీలు 30 నుంచి 35 శాతం మేర సిబ్బందిని పెంచుకోవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం 3 లక్షల తాత్కాలిక ఉద్యోగాలైనా అందుబాటులోకి వస్తాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఫర్హాన్ అజ్మీ అంటున్నారు. ఈ దీపావళి-క్రిస్మస్ సీజన్లో ఐటీ ఆధారిత సర్వీసులు, లాజిస్టిక్స్, ఈ-కామర్స్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని చెప్తున్నారు. ఇక ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్, తయారీ, ఎంఎస్ఎంఈ సంస్థల్లో 65,000-80,000 తాత్కాలిక ఉద్యోగ నియామకాలకు వీలున్నదని రాండ్‌స్టడ్ ఇండియా స్టాఫింగ్ డైరెక్టర్ యెషబ్ గిరి వెల్లడించారు. డెలివరీ స్టాఫ్, పికర్స్/ప్యాకర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలీ-కాలర్లు, ఇన్వార్డింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ డెవలపర్లు విభాగాల్లో భారీగా అవకాశాలున్నాయన్నారు.