Emergency alert | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్‌లో ప్రసంగిస్తుండగా ఆ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. దీనితో కొంతసేపు మీటింగ్ హాల్ అంతా నిశ్శబ్దమైపోయింది. వెంటనే కేటీఆర్ నిర్వాహకులను అలర్ట్ చేశారు. అది ఫైర్ ఎమర్జెన్సీ అలారంలా ఉన్నదని, ఒకసారి పరిశీలించాలని సూచించారు. మైక్ సిస్టం వల్ల అలా జరిగిందేమోనని నిర్వాహకులు చెప్పారు.
భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను రూపొందించింది. దేశ వ్యాప్తంగా దశలవారీగా దీనిని ప్రయోగిస్తున్నది. ఆ మెసేజ్‌లో టెలికమ్యూనికేషన్ చెందిన సెల్ బ్రాడ్ కాస్టింగ్ పంపించిన నమూనా టెస్టింగ్ మెసేజ్ ఇది. దీన్ని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్ పంపించాం. విపతర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది.