Starlink | ప్రపంక కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీ యాజమాన్యంలోని స్టార్‌లింక్ భారత్‌లో నియామకాలను ప్రారంభించింది. భారత్‌లో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను ప్రారంభానికి సంకేతంగా పేర్కొంటున్నారు. కంపెనీ స్పేస్ఎక్స్ కెరీర్స్ పోర్టల్ ప్రకారం.. స్టార్‌లింక్ ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లోని అనేక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో అకౌంటింగ్ మేనేజర్, పేమెంట్స్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అనలిస్ట్, టాక్స్ మేనేజర్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నది. బెంగళూరు కేంద్రంగా స్టార్‌లింక్ సేవలు అందించనున్నది. భారత్‌లోని స్థానిక నివాసితులు, చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్లను కలిగి ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నట్లు కంపెనీ పేర్కొంది.
స్టార్‌లింక్ సేవలు ఈ ఏడాది చివరినాటికి 2026 ప్రారంభంలో భారతదేశ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నది. కంపెనీ ప్రస్తుతం భారతదేశ భద్రత, నియంత్రణ ఆమోదాలపై పనిచేస్తోంది. సైబర్ భద్రత, చట్టబద్ధమైన అంతరాయ సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి స్టార్‌లింక్ ఇటీవల ముంబయిలోని భద్రతా సంస్థల వద్ద నెట్‌వర్క్‌ను ప్రదర్శించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) స్పెక్ట్రమ్ కేటాయింపుకు ఈ ప్రక్రియ అవసరం. స్పేస్ఎక్స్ భారత్‌లో ఇప్పటికే మూడు గ్రౌండ్ స్టేషన్లను నిర్మించింది. త్వరలోనే తనిఖీ కార్యక్రమం జరుగనున్నది. ఈ స్టేషన్లు ముంబయి, చెన్నై, నోయిడాలో ఉంటాయి. భవిష్యత్‌లో చండీగఢ్, లక్నో, కోల్‌కతా సహా 9 నుంచి 10 చోట్లకు విస్తరించాలని కంపెనీ యోచిస్తున్నది. ముంబయిలోని చండివాలి ప్రాంతంలో 1,294 చదరపు అడుగుల కార్యాలయాన్ని కూడా కంపెనీ లీజుకు తీసుకుంది. లీజు ఒప్పందం ప్రకారం.. కంపెనీ నెలవారీ అద్దె రూ.3.52 లక్షలు చెల్లించనున్నది. 3.17 మిలియన్లు సెక్యూరిటీ డిపాజిట్ జమ చేయనున్నది. స్టార్‌లింక్ సేవలకు వన్‌టైమ్ సెటప్ ఫీజు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు ఉండే అవకాశం ఉంది.
నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ రూ.3వేల నుంచి రూ.4,200 వరకు ఉంటాయని అంచనా. స్టార్ లింక్ సేవలు ప్రీమియం ఇంటర్నెట్ విభాగంలోకి రానున్నాయి. హై-స్పీడ్, తక్కువ-లేటెన్సీ ఇంటర్నెట్ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ కోసం పోటీ తీవ్రతరమైంది. యూటెల్సాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ వంటి కంపెనీల నుంచి స్టార్‌లింక్ గట్టి పోటీని ఎదుర్కోనుంది. ఈ కంపెనీలన్నీ నియంత్రణ ఆమోదానికి సంబంధించి చివరి దశలో ఉన్నాయి. స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. మరో వైపు అమెజాన్ తన ప్రాజెక్ట్ కైపర్‌లో భాగంగా భారత్‌లో నియామకాలను వేగవంతం చేస్తున్నది. కంపెనీ టెలికాం బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, జీటీఎం లీడ్, ప్రోగ్రామ్ మేనేజర్ వంటి పదవులకు అభ్యర్థులను వెతుకుతోంది. స్టార్‌లింక్, అమెజాన్ రెండూ తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తుండడంతో భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అమలు దశలోకి ప్రవేశించింది. ఇది దేశంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను విస్తరించడంతో పాటు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్ కనెక్టివిటీకి అందించనున్నది. మస్ కంపెనీ త్వరలోనే సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించి వచ్చే ఏడాదిలో హైస్పీడ్ శాటిలైట్ సేవలను ప్రారంభించాలని యోచిస్తుంది.