టెక్సాస్/క్యాలిఫోర్నియా, జూన్ 5: యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను, స్పేస్ఎక్స్ వ్యవస్థాపక అధినేత ఎలాన్ మస్క్ బెదిరించిమరీ బలవంతంగా ఓ డీల్‌ను కుదుర్చుకోవాలనుకున్నారు. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్, స్పేస్ టెక్నాలజీ దిగ్గజం స్పేస్ఎక్స్ మధ్య శాటిలైట్ స్పెక్ట్రమ్ రగడ నడుస్తున్న విషయం తెలిసిందే. మరి దీని వెనుక అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ వివరాల్లోకి వెళ్తే.. అది 2022. ఐఫోన్ 14ను మార్కెట్‌కు పరిచయం చేయడానికి కొద్ది వారాల ముందు యాపిల్ సంస్థకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపక అధినేత ఎలాన్ మస్క్ ఓ క్రేజీ ఆఫర్ చేశారు.
ఐఫోన్‌కు తన సంస్థ స్పేస్ఎక్స్ శాటిలైట్ కనెక్టివిటీని అందిస్తుందని, అయితే అందుకు 5 బిలియన్ డాలర్లు చెల్లించాలని, ఏడాదిన్నర తర్వాత ఏటా 1 బిలియన్ డాలర్ల చొప్పున చెల్లిస్తూ పోవాలన్నదే ఆ ఆఫర్. ఇందుకు యాపిల్‌ను ఎలాగైనా ఒప్పించాలనుకున్న మస్క్.. ఆ సంస్థ సీఈవో కుక్కు ఆలోచించుకొనేందుకు 72 గంటల సమయం ఇచ్చారు. ఈ క్రమంలోనే తన ఆఫర్‌ను కాదంటే ఐఫోన్లకు పోటీగా మరో ప్రత్యామ్నాయ సర్వీస్‌ను తెస్తానని బెదిరించారు.
అప్పటికే స్పెస్ఎక్స్, యాపిల్ మధ్య నడుస్తున్న వైరానికి మస్క్ ఆఫర్ కొంత విరామం ఇచ్చినా.. టిమ్ కుక్ ధిక్కారంతో అదికాస్తా తీవ్రమై మరో రూపు దాల్చింది. స్పేస్ఎక్స్తో పోల్చితే చిన్న సంస్థ అయిన గ్లోబల్స్టార్ను యాపిల్ తమ భాగస్వామిగా ఎంచుకొన్నది మరి. అయితే మస్క్ ఆఫర్ చాలా ఖరీదైనందునే కుక్.. స్పేస్ఎక్స్కు బదులుగా గ్లోబల్స్టార్ను ఎంచుకొన్నారని ఆనాటి సంఘటనల్ని చూసినవారు కొందరు చెప్తున్నారు.
తన ఆఫర్‌ను కుక్ తిరస్కరించి మరో సంస్థతో జట్టు కట్టడంతో ముందుగా హెచ్చరించినట్టుగానే కొద్ది నెలల్లోనే ‘స్టార్‌లింక్ డైరెక్ట్ టు సెల్’ పేరిట ఓ సంస్థను మస్క్ తీసుకొచ్చారు. స్పేస్ఎక్స్, టీ-మొబైల్ కలయికలో వచ్చిన ఈ కంపెనీ.. స్మార్ట్ఫోన్లకు శాటిలైట్ పవర్డ్ కమ్యూనికేషన్ సేవలను అందిస్తామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే టీ-మొబైల్ ద్వారా నేరుగా డైరెక్ట్ కనెక్టివిటీ సర్వీసులను మస్క్ అందించారు.
తమను కాదని గ్లోబల్‌స్టార్‌తో యాపిల్ జట్టు కట్టిన నేపథ్యంలో గ్లోబల్స్టార్ను మస్క్ టార్కెట్ చేశారు. స్పెక్ట్రమ్‌కు సంబంధించి గ్లోబల్‌స్టార్ హక్కులపై స్పేస్ఎక్స్ న్యాయపోరాటానికి దిగింది. కేటాయించిన స్పెక్ట్రమ్‌ను గ్లోబల్‌స్టార్ పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమైందని, దీనివల్ల తమ వంటి పోటీ సంస్థలు మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటున్నదని స్పేస్ఎక్స్ వాదించింది. ఇదిప్పుడు నేరుగా యాపిల్‌ను ప్రభావితం చేస్తున్నది.
ఒకవేళ ఈ కేసును స్పేస్ఎక్స్ గెలిస్తే గ్లోబల్‌స్టార్ స్పెక్ట్రమ్‌ను ఐఫోన్ కోసం వినియోగించడం యాపిల్‌కు ప్రశ్నార్థకమే. దీంతో ఐఫోన్‌కు శాటిలైట్ సర్వీస్‌ల కోసం యాపిల్ మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిందే. ఇప్పటికే గ్లోబల్‌స్టార్ సేవల కోసం బిలియన్ డాలర్లకొద్దీ పెట్టిన పెట్టుబడులు సైతం వృథా కానున్నాయి. మరోవైపు గ్లోబల్‌స్టార్ కంపెనీ పనితీరు, సేవలు ఆశించిన స్థాయిలో ఏమీ లేవని యాపిల్ కంపెనీలో చాలామంది ఉన్నతోద్యోగులు, నిపుణులు పెదవి విరుస్తున్నారు. కాలం చెల్లిన నెట్వర్క్ అని, ఇతర సంస్థలతో పోల్చితే చాలా నెమ్మదిగా సర్వీసులుంటాయని అంటున్నారు.