న్యూఢిల్లీ, నవంబర్ 25: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నుంచి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటీవ్ (ఈఎల్ఐ) పథకం ప్రయోజనాలను పొందాలంటే ఉద్యోగులు ఈ నెలాఖర్లోగా (నవంబర్ 30లోగా) తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకోవాలని, బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను అనుసంధానించుకోవాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది జూలైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈఎల్ఐ పథకాన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో మూడు రకాల స్కీములున్నాయి.
ఏ స్కీం: ఇందులో అన్ని సంఘటిత రంగాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి ఒక నెల జీతం అందిస్తారు. అయితే ఈపీఎఫ్‌వో సభ్యులై ఉండాలి.
బీ స్కీం: దీనిలో తొలి నాలుగేండ్ల ఉద్యోగ కాలంలో ఈపీఎఫ్‌వోకు చేసిన విరాళం ఆధారంగా అటు కంపెనీకి, ఇటు ఉద్యోగికి ఇద్దరికీ నిర్ణీత మొత్తంలో ప్రోత్సాహకాలు నేరుగా అందుతాయి. తయారీ రంగంలోని కొత్త ఉద్యోగులకే ఇది వర్తిస్తుంది.
సీ స్కీం: ఉద్యోగ కల్పనను పెంచడానికి దీన్ని రూపొందించారు. కొత్తగా చేర్చుకునే ప్రతీ ఉద్యోగికిగాను సంస్థకు రెండేండ్లపాటు నెలకు రూ.3,000 చొప్పున రీయింబర్స్మెంట్ అందిస్తారు.
ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కు వెళ్లాలి
ఆ తర్వాత కుడి వైపు కింద ఉన్న ‘ఇంపార్టెంట్ లింక్స్’లో ఉన్న ‘యాక్టివ్ యూఏఎన్’పై క్లిక్ చేయాలి.
ఆపై ఓపెన్ అయ్యే కొత్త పేజీలో యూఏఎన్ నెంబర్, ఆధార్, పుట్టినతేదీ, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి.
చివరగా ఆధార్‌తో అనుసంధానమైన మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ కోసం ‘గెట్ ఆథరైజేషన్ పిన్’పై క్లిక్ చేయాలి. ఆ ఓటీపీతో ప్రక్రియ పూర్తవుతుంది. పాస్వర్డ్ మీ మొబైల్‌కు వస్తుంది.