Adani | న్యూఢిల్లీ, అక్టోబర్ 18: కెన్యా వాసులకు కరెంట్ షాక్ గట్టిగానే తగలబోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సన్నిహితుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీతో కెన్యా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు కారణం. కెన్యాలో విద్యుత్తు లైన్ల ఏర్పాటు, కరెంట్ సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వంతో 736 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం కెన్యా వాసులపై తీవ్ర ప్రభావం చూపనున్నది.
ఈ ఒప్పందంతో ఇక్కడి ప్రజలకు ప్రాణసంకటంగా మారనున్నదని, ముఖ్యంగా విద్యుత్తు చార్జీలు రెండింతలు పెరిగే ప్రమాదం ఉన్నదని మీడియాలో కథ నం ప్రచురితమైంది. విద్యుత్తు లైన్ల ఏర్పాటు, కరెంటు సరఫరా కోసం 30 ఏండ్లకు గానూ కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్(కెట్రాకో)తో అదానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ప్రాజెక్టునకు సంబంధించి అదానీ గ్రూపు కెన్యా ప్రభుత్వానికి మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఒక్క శాతం 8 మిలియన్ డాలర్లు ఫీజు కింద చెల్లించనున్నది.
నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో విద్యుత్తు చార్జీలు భారీగా పెరిగాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం వల్లనే 2021 నుంచి 2022 మధ్యకాలంలో యూనిట్ చార్జీలు 102 శాతం పెరిగాయి. ఒక్కో యూనిట్ చార్జీ 2021లో రూ.3.58 ఉండగా, 2022 నాటికి ఇది రెండింతలు పెరిగి రూ.7.24కి చేరుకున్నది. ఈ విషయాన్ని స్వయాన ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి కను దేశాయ్ అసెంబ్లీలో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో కెన్యాలో కూడా విద్యుత్తు చార్జీలు రెండింతలు పెరిగే అవకాశం ఉన్నదని అంచనా. ప్రస్తుతం యూనిట్ చార్జీ కెన్యా కరెన్సీ ఎస్‌హెచ్ 5.51గా ఉండగా, ఈ చార్జి రెండు రెట్లు పెరిగి ఎస్‌హెచ్ 11.14కి చేరుకోనున్నది. దీంతో అక్కడి సామాన్యుడిపై అదానీ పిడుగు పడ్డట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదానీకి చెందిన సంస్థలకు ప్రయోజనాలు కల్పించడానికి కెన్యా ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంలో అక్కడి ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే అదానీ-మోదీ బంధంపై ఆ దేశ మాజీ ప్రధాని ఒడింగా ప్రత్యేకంగా ఆరోపించగా..తాజాగా కిసిల్ సెనేటర్ రిచర్డ్ ఓనైయంకా అదానీ విద్యుత్తు ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించారు.
గౌతమ్ అదానీకి గుజరాత్ ప్రభుత్వం దాసోహమైంది. ముఖ్యంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి అదానీ కంపెనీ చెప్పినట్లే విద్యుత్ చార్జీలను అమాంతం పెంచేసింది. జనవరి 2021లో ఒక్కో యూనిట్‌కు రూ.2.83 చెల్లించి అదానీ నుంచి కొనుగోలు చేసిన గుజరాత్ సర్కార్..ఆ మరుసటి ఏడాది చివరినాటికి ఇది రూ.8.83కి పెంచింది. అలాగే అదానీ నుంచి 2021లో 5,587 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసిన ఆ రాష్ట్ర సర్కార్..ఆ మరుసటి ఏడాది 7.5 శాతం పెరిగి 6,007 యూనిట్లకు పెంచుకున్నది. ఆ రెండేండ్లలోనే అదానీ పవర్‌కు రూ.8,160 కోట్ల చెల్లింపులు జరిపింది.