ముంబై, జనవరి 7: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. 2025 సంవత్సరంలో 22,70,107 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని దేశీయ ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది అమ్ముడైన 19.50 లక్షల వాహనాలతో పోలిస్తే 16.37 శాతం ఎగబాకాయి.
వీటిలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 77 శాతం ఎగబాకి 1,76,817 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే ఈ-కమర్షియల్ వాహన సేల్స్ కూడా 54 శాతం అధికమై 15,606 యూనిట్లకు చేరాయి. 12,79,951 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడుపోగా, 7,97,733 యూనిట్ల త్రీచక్ర వాహనాలు ఉన్నాయి. ఈవీలకు ఆదరణ పెరుగుతున్నదని, ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, దీంతో గతేడాది 12.80 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని ఫాడా ప్రెసిడెంట్ విఘ్ణేశ్వర్ తెలిపారు.