న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) వినియోగం ఊపందుకుంటున్నది. గత నెలలో మునుపెన్నడూ లేనివిధంగా ఈవీల రిటైల్ విక్రయా లు జరిగాయి మరి. జూన్‌లో ఆల్‌టైమ్ హై రికార్డును సృష్టిస్తూ ఏకంగా 3 లక్షల మార్కును దాటి 3,06,220 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్‌తో పోల్చితే అమ్మకాల్లో 63 శాతం వృద్ధి కనిపించింది. అంతేగాక ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాహనాల్లో 12 శాతానికిపైగా ఈవీలేనని ఈ స్థాయిలో లెక్క తేలడం ఇదే తొలిసారి అంటూ ఆటోమొబైల్ డీలర్ల సంఘ సమాఖ్య (ఫడా) అధ్యక్షుడు సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.
ఈవీల కొనుగోళ్లలో టూవీలర్లదే పైచేయిగా ఉన్నది. గత నెలలో 1,98,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. నిరుడు జూన్‌లో 1,10,719 యూనిట్లే. దీంతో ఈసారి 74.98 శాతం వృద్ధి నమోదైందని ఓ ప్రకటనలో ఫడా వెల్లడించింది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్ రిటైల్ సేల్స్ కూడా 15,318 యూనిట్ల నుంచి 31,823 యూనిట్లకు పెరిగాయి. అలాగే త్రీవీలర్ ఈవీల అమ్మకాలు ఈసారి 77,448 యూనిట్లుగా ఉంటే.. పోయినసారి 60,802 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహనాల్లోనూ ఈవీల వినియోగం పెరుగుతుండటం విశేషం. ఏడాది వ్యవధిలో 1,219 యూనిట్ల నుంచి 3,214 యూనిట్లకు చేరాయి.
ఈవీల వినియోగంలో వాహనదారుల ఆలోచనా సరళి మారుతున్నదని, అందుకే ఒకప్పుడు ద్విచక్ర వాహనాలకే కనిపించిన డిమాండ్.. ఇప్పుడు త్రీవీలర్, కార్లు, తేలికపాటి వాణిజ్య వాహనాల విషయంలోనూ వ్యక్తమవుతున్నదని ఇండస్ట్రీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మున్ముందు ఈవీల సేల్స్ ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని సెగ్మెంట్లలో ఈవీలు అందుబాటులోకి రాగా.. లగ్జరీ వాహనాల తయారీ సంస్థలైన బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్ వంటి కంపెనీలూ రకరకాల మాడళ్లను మార్కెట్‌కు పరిచయం చేస్తుండటం గమనార్హం. ఇక ప్రారంభ శ్రేణిలో టాటా మోటర్స్ దూకుడుగా ఉన్నది. అర డజనుకుగాపై మాడళ్లను విక్రయిస్తుండటం విశేషం. మహీంద్రా, హ్యుందాయ్, మారుతీ కూడా ఈవీలకు పెద్దపీట వేస్తున్నాయి.
దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, భారంగా మారిన పెట్రో దిగుమతులు.. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాయితీలను ప్రకటిస్తుండటంతో నూతన వాహనాల కొనుగోలుదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీల్లో తగ్గింపులు, ఆటో కంపెనీలు ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీల మార్పిడి అవకాశాలు సైతం కలిసొస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈవీల వినియోగం పర్యావరణంగానేగాక, విదేశీ మారకద్రవ్యం పొదుపునకు కూడా దోహదం చేస్తుందన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వాహన తయారీదారులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తే.. సెమీ కండక్టర్ తయారీకి సహకరిస్తే ఈవీల వినియోగం ఇంకా పుంజుకోగలదన్న ఆశాభావం అటు ఇండస్ట్రీ నుంచి ఇటు ఎక్స్పర్ట్స్ నుంచి కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే దిగుమతి అవుతున్న చిప్‌లు చౌకగా లభించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచిస్తున్నారు.