నూఢిల్లీ, జనవరి 20: ఎలక్ట్రిక్ వాహన పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్..మరో ఎలక్ట్రిక్ ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో విడుదల చేసిన ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రి-చక్ర వాహనం ధర రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. సింగిల్చార్జింగ్తో 179 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. వ్యూహాత్మక ఈవీ వ్యాపారంలో భాగంగా ఈ నయా వాహనాన్ని విడుదల చేసినట్లు, ప్రస్తుతానికి ప్యాసింజర్ వాహనాన్ని విడుదల చేసినట్లు, భవిష్యత్తులో కార్గొ వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సంస్థ రూ.125 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా నెలకు 16 వేల యూనిట్ల ఆటోలు అమ్ముడవుతుండగా, భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉన్నదన్నారు.