చర్లపల్లి, జూలై 8: ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)…ఎలక్షన్ కమిషన్ ఆఫ్ భూటాన్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం) తయారుచేసి ఇవ్వాల్సివుంటుంది. ఇందుకు సంబంధించి ఈసీఐఎల్ సీఎండీ, టెక్నికల్ డైరెక్టర్ అనిశ్ కుమార్ శర్మ..భూటాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దేకీపేమాలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ సీఎండీ అనిశ్ కుమార్ శర్మ మాట్లడుతూ..స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న ఈవీఎం మిషన్స్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తున్నదని, తాజాగా భూటాన్ ఎలక్షన్ కమిషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈవీఎంలను సరఫరా చేయాల్సివుంటుందన్నారు.
52 పైసలు కోల్పోయిన రూపీ
ముంబై, జూలై 8: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు దిగజారింది. ఉదయం ఆరంభంలో 95.15 వద్ద మొదలవగా ఒకానొక దశలో 94.98కి బలపడింది. అయితే మళ్లీ 95.61 వద్దకు పడిపోయింది. చివరకు 95.48 దగ్గర నిలిచింది. మంగళవారం 94.96 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. కాగా, హొర్ముజ్ జలసంధిలో 3 నౌకలను ఇరాన్ దిగ్బధించడంతో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో మరోమారు ముడి చమురు ధరలు పెరుగగా.. డాలర్ బలపడింది. ఇది రూపీని బలహీనపర్చిందని ఫారెక్స్ మార్కెట్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.