Market Capitalisation | అమెరికా ఫెడ్ రిజర్వు త్వరలో వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఫలితంగా గతవారం ట్రేడింగ్‌లో టాప్-10 స్టాక్స్‌లో ఎనిమిది సంస్థలు రూ.1,03,732.39 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా దెబ్బ తిన్నాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 673.84 పాయింట్లు (1.12 శాతం) నష్టపోయాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ మినహా టాప్-8 స్ట్రిప్ట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కొడిగట్టుకుపోయింది.
మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.41,878.37 కోట్లు కోల్పోయి, రూ.15,71,724.26 కోట్ల వద్ద నిలిచింది. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ షేర్ గరిష్టంగా పతనమైంది. ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,134.73 కోట్లు నష్టంతో రూ.5,88,379.98 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.15,007.38 కోట్లు నష్టపోయి రూ.8,86,300.20 కోట్ల వద్ద నిలిచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,360.59 కోట్ల పతనంతో రూ.4,88,399.39 కోట్లతో సరిపెట్టుకున్నది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,893.18 కోట్లు నష్టంతో రూ.4,77,524.24 కోట్ల వద్ద నిలిచింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.4,281.09 కోట్ల పతనంతో రూ.12,18,848.31 కోట్లకు పరిమితమైంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.3,555.83 కోట్ల నష్టంతో రూ.6,19,155.97 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.1,621.22 కోట్లు కోల్పోయి రూ.5,78,739.57 కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,071.99 కోట్లు వృద్ధి చెంది రూ.4,31,230.51 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.4,036.2 కోట్లు పెరిగి రూ.4,81,922.33 కోట్లకు చేరుకున్నది. గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లీడ్‌లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్పోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.