ముంబై, మే 22: రూ.2000 నోటును ఉపసంహరించిన రిజర్వ్‌బ్యాంక్ తిరిగి రూ.1000 నోటును తెస్తుందన్న వార్తలను గవర్నర్ శక్తికాంత్ దాస్ కొట్టివేశారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రూ.1000 నోటును పునర్ప్రవేశపడతారన్న వార్తలపై ఎదురైన ప్రశ్నకు దాస్ బదులిస్తూ ‘ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన ఏదీ లేదు. ఆ ప్రశ్న ఊహాజనితమే’ అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై రూ.2000 నోటు ఉపసంహరణ ప్రభావం ‘చాలా చాలా తక్కువ’ అన్నారు.
ఏం చేస్తామో చెప్పలేను..
రూ.2000 నోటును సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించినప్పటికీ లీగల్ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లీగల్ టెండర్‌గా కొనసాగుతుందా అన్న ప్రశ్నకు దాస్ సమాధానమిస్తూ ‘ఎన్ని నోట్లు తిరిగి వస్తున్నాయో తెలుసుకునేందుకు వేచి చూస్తున్నాం. సెప్టెంబర్ 30 తర్వాత ఏ జరుగుతుందనే అంశమై ఊహాజనిత సమాధానాన్ని నేను చెప్పలేను’ అంటూ వివరించారు.