హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ 17న ఈడీ దాడి చేసి షోరూమ్స్లోని ఆస్తులు, ఆభరణాలు, పత్రాలను సీజ్ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కే శరత్ బుధవారం విచారణ జరిపారు. ఈడీ అధికారులు సీజ్ చేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈడీ జప్తులను చట్టవ్యతిరేకమని ప్రకటించాలని సీనియర్ న్యాయవాది బీ చంద్రసేన్‌రెడ్డి వాదించారు.
ఏవిధమైన కేసులు పిటిషనర్‌పై లేవని, ఈడీలో సోదాలు చేసి సీజ్ చేయడం అన్యాయమని తన వాదన వినిపించారు. పత్రాలను కూడా సీజ్ చేయడం అన్యాయమని చెప్పారు. సీజ్ చేయడానికి ఈడీ కారణాలు చెప్పకపోవడం చట్ట ఉల్లంఘనే అన్నారు. సీజ్ చేసిన వెంటనే ఆ విషయాన్ని అడ్జుడికేటింగ్ అథారిటీకి ఈడీ చెప్పకపోవడం చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమేనని తెలిపారు. వాదనల అనంతరం హైకోర్టు ఈడీ జప్తు చేసిన వాటిని వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.