న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 : అనిల్ అంబానీకి చెందిన మరో రూ.3 వేల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). బ్యాంకులను మోసం చేసిన కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఆరోపిస్తున్న ఈడీ.. తాజాగా అనిల్ అంబానీ, ఆయన కుమారుడు అన్షుల్ అంబానీలకు చెందిన రూ.3,034 కోట్ల విలువైన ఖాందాల ఫామ్‌హౌస్‌ను జప్తు చేసినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆస్తులను దుర్వినియోగం చేయడంతోపాటు బ్యాంకులను మోసం చేసిన కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్నది. దీనిపై అడాగ్ ప్రతినిధి మాట్లాడుతూ..అనిల్ అంబానీ తల్లి కోకిలాబెన్ డీ అంబానీ ఆస్తులను కూడా జప్తు చేశారని పేర్కొన్నారు.ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ, ఎల్ఐసీలు నమోదు చేసిన కేసులపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ను దాఖలు చేసింది.