న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: నీరవ్ మోదీకి చెందిన మరో రూ.29.75 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2 బిలియన్ డాలర్ల (డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి విలువలో దాదాపు రూ.17 వేల కోట్లు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మేనమామ, రత్నాల వ్యాపారి మెహుల్ చోక్సీ సైతం కీలక నిందితుడే.
ఇక ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటిదాకా దేశ, విదేశాల్లోని రూ.2,596 కోట్ల విలువైన నీరవ్ ఆస్తుల్ని అటాచ్ చేసింది. కాగా, తాజా జప్తులో బ్యాంక్ డిపాజిట్లు, భూమి, భవనాలున్నట్టు ఓ ప్రకటనలో ఈడీ పేర్కొన్నది. పీఎన్బీ మోసం నేపథ్యంలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు దేశం విడిచి పరారైపోగా.. నీరవ్ ఇప్పుడు బ్రిటన్ జైలులో ఉన్నాడు. అతని అప్పగింత కోసం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ విశ్వ ప్రయత్నాలనే చేస్తున్నది.
ముంబైలోని బ్రాడీ హౌజ్ పీఎన్బీ శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం జరిగింది. బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి నకిలీ/మోసపూరిత ఎల్వోయూలతో నీరవ్, చోక్సీలు వేల కోట్ల రుణాలను పొందారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటిదాకా రూ.1,052.42 కోట్ల సొమ్మును పీఎన్బీ, ఇతర బ్యాంకులకు అప్పజెప్పినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.