ED Raids China Loan Apps | చైనీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న లోన్ యాప్ల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బెంగళూరులోని రేజోర్పే, పేటీఎం, క్యాష్ ఫ్రీ వంటి ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ సంస్థల కార్యాలయాలపై దాడులు చేసింది. ఆరుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. చైనీయుల నియంత్రణలో నడుస్తున్న ఈ సంస్థలపై జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు రూ.17 కోట్లు జప్తు చేసినట్లు వివరించింది. ఈ సొమ్ము `మర్చంట్ ఐడీస్, చైనీయుల నియంత్రణలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో` జమ చేశారని తెలిపింది.
భారతీయుల పేరిట పత్రాలు సృష్టించి.. వారిని ఆయా సంస్థల డైరెక్టర్లుగా నియమించి ఆన్లైన్ రుణాల మంజూరు చేస్తున్నాయని ఈడీ అభియోగం. వేర్వేరు మర్చంట్ ఐడీలు, ఖాతాలు నిర్వహిస్తున్న పేమెంట్ గేట్వే సంస్థలు, బ్యాంకులు చట్ట విరుద్ధంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈడీ అధికారులు తెలిపారు. తమ తనిఖీల్లో రెజోర్పే, క్యాష్ ఫ్రీ పేమెంట్స్, పేటీఎం పేమెంట్ సర్వీసెస్ వంటి సంస్థలను చైనీయులు నియంత్రిస్తున్నారని తేలిందని చెప్పారు.
ఈ ఆన్లైన్ పేమెంట్ గేట్వే సంస్థలు మొబైల్ యాప్స్ ద్వారా చిన్న మొత్తాల రుణాలను త్వరితగతిన మంజూరు చేసి, అటుపై వాటి వసూళ్ల పేరిట అమాయకులను వేధిస్తున్నాయని ఈడీ ఆరోపించింది. రుణాలు పంపిణీ చేశాక అధిక వడ్డీ వసూలు చేస్తూ అమాయకులను వేధిస్తున్నట్లు దేశవ్యాప్తంగా వార్తలొచ్చాయి. వడ్డీ ఇవ్వని వారిని బెదిరించిన ఘటనలపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ విషయమై బెంగళూరు సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన 18 కేసుల ఆధారంగా తాము హవాలా లావాదేవీల కేసు రిజిస్టర్ చేశామని ఈడీ వివరించింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సదరు ఆన్లైన్ పేమెంట్ గేట్వే సంస్థలు ఇచ్చిన చిరునామాలు పూర్తిగా ఫేక్ అని తెలిపింది.
తాము ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని రెజోర్పే అధికార ప్రతినిధి చెప్పారు. దర్యాప్తులో భాగంగా తమను అదనపు సమాచారం ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారన్నారు. రుణాల మంజూరు కోసం తాము సేకరిస్తున్న కేవైసీ, ఇతర వివరాలను దర్యాప్తు అధికారులకు అందజేశామన్నారు. ఈడీ దర్యాప్తునకు సహకరిస్తామని క్యాష్ ఫ్రీ ఒక ప్రకటనలో తెలిపింది.