న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: చైనా ఫిన్‌టెక్ రుణాల కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పలు ఆన్లైన్ పేమెంట్ గేట్‌వే కంపెనీలపై దాడులు జరిపింది. చైనీయుల నియంత్రణలోని ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) సంస్థలు చట్టవిరుద్ధంగా స్మార్ట్ఫోన్ల ద్వారా ఇన్స్టెంట్ రుణాలు అందిస్తున్న అంశమై తమ దర్యాప్తులో భాగంగా బెంగళూరులోని పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ తదితర ఆన్లైన్ పేమెంట్ కంపెనీల ఆవరణల్లో దాడులు నిర్వహించినట్టు ఈడీ శనివారం ప్రకటించింది. ఆరు ఆవరణల్లో శుక్రవారం సోదాలు జరిపామని, ఈ ప్రక్రియ కొనసాగుతున్నదన్నది. దాడుల సందర్భంగా వివిధ మర్చెంట్ ఐడీలు, బ్యాంక్ ఆకౌంట్లలో ఈ చైనా లోన్‌యాప్స్‌కు చెందిన రూ.17 కోట్లు స్వాధీనపర్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది. భారతీయుల పేరిట నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి, చైనా యాప్ సంస్థల్లో వారిని డమ్మీ డైరెక్టర్లుగా చూపించి నేరాలకు పాల్పడుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
ఈ సంస్థలు చైనా జాతీయుల నిర్వహణలో ఉంటాయని, వారే నిర్వహిస్తారన్నది. పేమెంట్ గేట్వేలు/బ్యాంక్‌ల వద్ద ఉన్న మర్చెంట్ ఐడీలు/ఖాతాల ద్వారా చట్ట విరుద్ధంగా ఆ సంస్థలు వ్యాపారాన్ని నడుపుడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నది. పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రేజర్‌పే ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్ ఆవరణలు, చైనీయుల నియంత్రణలోని సంస్థల ఆవరణల్లో సోదాలు జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది. మొబైల్ యాప్స్ ద్వారా చిన్న చిన్న రుణాలు తీసుకున్న ప్రజల్ని వేధింపులు, బెదిరింపులకు గురిచేస్తున్న పలు సంస్థలు, వ్యక్తులపై బెంగళూరు సైబర్‌క్రైమ్ పోలీసులు నమోదు చేసిన 18 ఎఫ్ఐఆర్ల ఆధారంగా వాటిపై తాము మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపారు.